గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు
- 2025లో స్వామివారికి కిరీటాన్ని సమర్పించిన దాత మాటూరు సుబ్బారావు
- రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టిన కమిటీ సభ్యులు
- జరిగిన నిర్వాకంపై మండిపడుతున్న భక్తులు
కృష్ణా జిల్లా గుడివాడలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడిన ఒక షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. స్వామివారి బంగారు కిరీటాన్ని, ఆలయ కమిటీ సభ్యులు తమ సొంత అవసరాల కోసం గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో తాకట్టు పెట్టి భారీగా డబ్బులు డ్రా చేసుకున్నారు. మాటూరు సుబ్బారావు అనే దాత 2025లో సుమారు రూ. 70 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని స్వామివారికి విరాళంగా సమర్పించారు. అయితే, ఇటీవల కాలంలో స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించకపోవడంతో అనుమానం వచ్చిన దాతలు ఆలయ కమిటీని నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపెట్టిన కమిటీ సభ్యులు.. ఆ కిరీటాన్ని రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు అంగీకరించారు.
ఈ వ్యవహారంపై దాత సుబ్బారావు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి సమక్షంలో స్వామివారికి బహూకరించిన కానుకలతో ఇలా వ్యాపారం చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ వంచనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సివిల్ వ్యవహారంగా పేర్కొంటూ కోర్టుకు వెళ్లమని పోలీసులు సూచించారని దాత ఆరోపించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసిన ఈ కమిటీ నుండి ఆ బంగారు కిరీటాన్ని వెంటనే రికవరీ చేసి తమకు అప్పగించాలని, దాన్ని భక్తుల నమ్మకాన్ని కాపాడే మరో మంచి ఆలయానికి సమర్పిస్తామని దాతలు స్పష్టం చేస్తున్నారు. భగవంతుడి సొత్తును సైతం పక్కదారి పట్టించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.